నిజామాబాద్, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య బి. విద్యావర్ధిని తదితర సిబ్బంది మంగళవారం ఉదయం నిశిత డిగ్రీ అండ్ పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ… నిశిత కళాశాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా వీసీ ఆదేశించారని అన్నారు.
చాలినన్ని తరగతి గదులు లేకపోవడం, సరిపడు కంప్యూటర్, సైన్స్ లాబ్స్ లేకపోవడం, మైదాన ప్రదేశం లేకపోవడం, వాహన పార్కింగ్ లేకపోవడం, లైబ్రెరీలో రిఫరెన్స్ బుక్స్ లేకపోవడం, ఆయా కోర్సులకు సరిపోయే అధ్యాపకులు లేకపోవడం వంటివి తమ తనిఖీలో బయట పడ్డాయని అన్నారు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లోపాలతో సమగ్ర నివేదికను వీసీకి అందించినట్లు ఆమె వివరించారు. అందుకు వీసీ తక్షణమే నిశిత కళాశాల మీద తగు చర్యలను తీసుకోవలసిందిగా తనను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.