నిజామాబాద్, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు. ఆయా పీహెచ్‌సిల వారీగా పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని నిలదీశారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్ తదితర వాటి అమలును నిశితంగా పరిశీలన జరిపిన కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ లకు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి గర్భిణీకి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్నారు. ఏ ఒక్కరి పేరు నమోదు జరగకపోయినా, సంబంధిత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ను బాద్యులుగా పరిగణిస్తూ వేతనాల్లో కొత్త విధిస్తామని, అప్పటికీ పనితీరు మార్చుకోకపోతే సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ తేల్చి చెప్పారు. గర్భిణీల వివరాల నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాలని, ఏ ఒక్కరు కూడా మినహాయించబడకుండా ప్రతి గర్భిణీ మహిళ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షణ చేయాలని హితవు పలికారు.
క్రమంతప్పకుండా వారు ఆరోగ్య పరీక్షలు జరుపుకునేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తహీనతకు లోనవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భిణీలు కాన్పు చేయించుకునేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 486 కాన్పులు జరుగగా, అందులో 182 ప్రభుత్వ ఆసుపత్తూరుల్లో, 151 ప్రైవేట్ నర్సింగ్ హోంలలో జరిగాయని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత గణనీయంగా పెరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర సగటు 66 శాతాన్ని దాటాలని సూచించారు.
ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తే ప్రజలు తప్పకుండా ప్రుభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకుంటారని అన్నారు. నామ్ కె వాస్తే అన్నట్టుగా పని చేస్తే ప్రయోజనం ఉండదని, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజీరియన్ ఆపరేషన్లు చేయకూడదని సూచించారు. ఇకపై ప్రతి సిజీరియన్ ఆపరేషన్ కు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలన జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏఎన్‌ఎంలు, మెడికల్ ఆఫీసర్లు ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతనే ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలు అప్లోడ్ చేయాలని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు వివరాలు, నివేదికలు అందించవద్దని, ప్రతి పేషెంట్‌కు సంబంధించిన వివరాలను ఇతర శాఖల అధికారులచే ర్యాన్ డమ్ పద్దతిలో పరిశీలన చేయిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పీహెచ్‌సిల పనితీరును డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు అనునిత్యం పర్యవేక్షణ చేయాలని, ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైలేరియా, లెప్రసీ, టీబీ వంటి వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి, వారి శాంపిల్స్ సేకరించి పంపించాలన్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 20 వ తేదీ నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని, వైద్యారోగా శాఖ అంశాలు చర్చించేలా కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యారోగ్య శాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ రాజేష్, డీఎం హెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎం హెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, స్త్రీ శిశు సంరక్షణ విభాగం పీ.ఓ డాక్టర్ అంజన తదితరులు పాల్గొన్నారు.