కామారెడ్డి, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ వాడుకలో ఉండే విధంగా మండల స్థాయి అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
వైకుంఠధామంలో నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. అన్ని గ్రామాలలో మరుగుదొడ్లు ప్రజలు వినియోగించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. వచ్చే హరితహారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లో ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించాలని సూచించారు. గ్రామాల్లోని ప్రధాన రోడ్లు పై మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని చెప్పారు.
గ్రామాల్లో తడి ,పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులను తయారు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులను వారం రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని సూచించారు. చెరువు కట్ట పైన హరిత హారంలో మొక్కలు నాటాలని కోరారు. ప్రతి మండలంలో 2 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం కోసం స్థలాలను గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు శుభ్రంగా ఉండే విధంగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఎఫ్వో నిఖిత, జడ్పీ సీఈఓ సాయా గౌడ్, జిల్లా ఉద్యానవన అధికారి సంజీవ రావు, జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి, ఉపాధి హామీ ఏపీడి శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.