నిజామాబాద్, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం కల్పించకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో చీఫ్ సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సి పరీక్షలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని అన్నారు. ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించినా ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నమవుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా సిఎస్‌లు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఎస్‌ఎస్‌సి బోర్డు ద్వారా జారీ అయిన నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహన ఏర్పరుచుకుని ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పక్కాగా పరీక్షలను జరిపించాలని సూచించారు.
ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేకుండా నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. తప్పనిసరిగా సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ క్వశ్చన్ పేపర్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి సంఘటనలు జరిగితే చీఫ్ సూపరింటెండెంట్లను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు అనుమతించకూడదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్లు తీసుకువస్తే, గేట్ వద్దనే స్వాధీనపరుచుకుని వాటిని డిపాజిట్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
బయటి వ్యక్తులు ఎవరూ లోనికి వెళ్లకుండా చూడాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎగ్జామ్ సెంటర్ నుండి ఎవరూ కూడా బయటకు రాకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తనతో పాటు ఇతర జిల్లా అధికారులను ఆకస్మిక తనిఖీల కోసం నియమిస్తామని, తనిఖీల్లో ఎక్కడైనా నిబంధనల అతిక్రమణ జరిగినట్టు కనిపిస్తే సిఎస్‌లపై వేటు తప్పదని కలెక్టర్ స్పష్టం చేశారు.
పోలీసు బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సరిపడా ఫర్నిచర్, తాగునీటి వసతి, ఇన్విజిలేటర్లు, ఓఎంఆర్ షీట్లు, ఆన్సర్ షీట్‌లు తదితర సదుపాయాలను చీఫ్ సూపరింటెండెంట్లు స్వయంగా పరిశీలించుకోవాలని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో తప్పనిసరిగా విద్యుత్ వసతి, సీలింగ్ ఫ్యాన్ పని చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి. దుర్గాప్రసాద్, పరీక్షల నియంత్రణ అధికారి విజయ భాస్కర్, ఆయా మండలాల ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.