కామారెడ్డి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక వివక్షతపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానం లో 26 దళిత బాలికల పాఠశాలను స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. దళితుల అభ్యున్నతికి పాటు పడ్డారని చెప్పారు. స్వాతంత్య్రానికి ముందు దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని పేర్కొన్నారు.
సామాజిక వివక్షతలు, అసమానతలు, మూఢనమ్మకాలపై పోరాటం చేశారని తెలిపారు. జోగిని వ్యవస్థను రూపుమాపడానికి పోరాటం చేశారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రజిత, అధికారులు పాల్గొన్నారు.