కామారెడ్డి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు స్వశక్తితో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ సహకారంతో 50 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి రోటరీ ప్రతినిధులు కృషి చేశారని తెలిపారు.
మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా సహకారం అందించాలని పేర్కొన్నారు. మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. కుట్టు శిక్షణ నేర్చుకోవాలనుకునే మహిళలకు డిచ్‌పల్లి శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ వారు రక్తదాన శిబిరాలు, పాఠశాలలో ఫర్నిచర్, తాగునీటి వంటి వసతులు కల్పించారని చెప్పారు.
పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్, కోశాధికారి అమర్నాథ్, ఆర్గనైజర్ లక్ష్మీ నరసింహులు, ప్రతినిధులు హనుమంత్ రెడ్డి, వైద్యనాథ్, శ్రీశైలం పాల్గొన్నారు.