నిజామాబాద్, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి వెంకన్న అన్నారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాదన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం 257 రూపాయలు ఎక్కడా అందడం లేదన్నారు.
ఉపాధి కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్న నిబంధనలు పనిప్రదేశాల్లో అమలు కావడం లేదన్నారు. ఉపాధి హామీ చట్టంలో రూపొందించిన మౌలిక విషయాలు విస్మరిస్తూ పథకాన్ని నిరుపయోగంగా మారుస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు.
పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించడం కోసం సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ, అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం జరిగే జిల్లా కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్, రూరల్ సబ్ డివిజన్ కార్యదర్శి సి.హెచ్. సాయగౌడ్ నాయకులు నారాయణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.