నిజామాబాద్, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ 3 నుండి 17వ తేదీ వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ప్రగతి గురించి దిశానిర్దేశం చేశారు.
నూటికి నూరు శాతం లక్ష్య సాధన దిశగా పల్లె ప్రగతి కార్యక్రమాలు జరగాలని ఆదేశించారు. మండల, గ్రామ స్థాయి ప్రత్యేక అధికారులు స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకొని క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల పట్ల ఆయా గ్రామాల సర్పంచులకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రాధాన్యతను తెలియజేయాలని, వారు తప్పనిసరిగా భాగస్వాములై లక్ష్యసాధనకు కృషి చేసేలా చూడాలన్నారు. ముఖ్యంగా వైకుంఠధామాలలో తప్పనిసరిగా నీటి వసతి, విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా ఇప్పటికే ఉన్న మొక్కలు ఎన్ని, ఇంకనూ ఖాళీ స్థలంలో నాటవలసిన మొక్కలు ఎన్ని అనే వివరాలను సేకరించి తదనుగుణంగా మొక్కలు నాటించాలన్నారు. నివాస ప్రాంతాల నుండి రోజువారీగా తడి, పొడి చెత్తను సేకరించేలా చర్యలు చేపడుతూ, తడి చెత్త నుండి కంపోస్టు ఎరువు తయారు కావాలన్నారు. పల్లె ప్రకృతి వనాల నిర్వహణను మరింతగా మెరుగుపరుస్తూ, ఇంకను ఖాళీ స్థలాలు ఉంటే ప్రతి చదరపు మీటరుకు ఒకటి చొప్పున మొక్కలు నాటించాలని సూచించారు.
ప్రత్యేకంగా ఎంపిక చేసిన 139 గ్రామ పంచాయతీల పరిధిలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసేనాటికి ఈ పనులన్నీ నూటికి నూరు శాతం పూర్తి కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పల్లె ప్రగతి లక్ష్య సాధనలో అలసత్వ ధోరణి ప్రదర్శిస్తే కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్, సచివాలయ కార్యదర్శులకు వివరిస్తూ వారు తప్పనిసరిగా నిర్ణీత కార్యక్రమాల అమలులో ప్రగతి సాధించేలా ప్రత్యేక అధికారులు చొరవ చూపాలన్నారు.
పై పైన పనులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. కాగా, ఈసారి హరితహారంలో చెరువులు, కాల్వ గట్ల వెంబడి పెద్దఎత్తున మొక్కలు నాటనున్న దృష్ట్యా ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. అదేవిధంగా అటవీ శాఖకు చెందిన అనువైన బ్లాక్ లను సైతం మొక్కలు నాటేందుకు ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నివాస ప్రాంతంలోనూ వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించని కుటుంబాలను గుర్తించాలని, ఒకవేళ ఎక్కడైనా మరుగుదొడ్లు లేనట్లయితే పల్లె ప్రగతి లో మంజూరు చేస్తామన్నారు.
ఆసరా పథకం కింద పింఛన్లకు అర్హులైన వారి వివరాలను సేకరించాలని, అదే సమయంలో చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉండరాదని అన్నారు. కార్యక్రమాలన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత ప్రత్యేక అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.