కామారెడ్డి, మే 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్యశ్రీ పథకంను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై జరిగిన శిక్షణ కేంద్రానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి వారం రోజులకు ఒకసారి ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు 100 శాతం అమలయ్యేలా చూడాలని కోరారు. వైద్యులు సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించిన వైద్యులు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, పిహెచ్‌సిలకు ఆరోగ్యశ్రీ పథకం లాగిన్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై వైద్యాధికారి నితిన్ రెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం జిల్లాలో అమలయ్యే విధంగా వైద్యాధికారులు దృష్టి సారించాలని కోరారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓలు, వైద్యాధికారులు, ఆర్‌బిఎస్‌కె వైద్యులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.