నిజామాబాద్, మే 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకుని నాణ్యమైన సేవలందిస్తే వైద్య శాఖకు మంచి పేరు వస్తుందని, నూటికి నూరు శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని హితవు పలికారు. పనితీరు మార్చుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. పీహెచ్‌సిల వారీగా గర్భిణీల నమోదు, ఆరోగ్య పరీక్షల నిర్వహణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, ఇమ్మునైజేషన్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని కారణాలు అడిగారు. ఈ సందర్భంగా పలువురు మెడికల్ ఆఫీసర్‌లు, ఏఎన్‌ఎంలు వివరణ ఇస్తూ, తాము ఎంతగా చెప్పినప్పటికీ కొందరు కాన్పుల కోసం ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకే వెళ్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, అన్ని సదుపాయాలతో ఉచితంగా కాన్పులు చేస్తూ, కేసీఆర్ కిట్ ద్వారా లబ్ది చేకూరుస్తున్నప్పటికీ, ప్రజలు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారంటే మన సేవల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది సమీక్షించుకోవాలని సూచించారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు తప్పనిసరిగా ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు జరుపుకునేలా చూడాలని, తద్వారా వారిపై ఆర్థిక భారం పడకుండా కాపాడవచ్చని అన్నారు.
అంతేకాకుండా ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లలో లెక్కకు మిక్కిలి జరుగుతున్న సిజేరియన్ ల బారినుండి కాపాడినట్లు అవుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు ఆర్మూర్, బోధన్ ఏరియా ఆసుపత్రుల్లో రక్షిత మంచి నీరు, శానిటేషన్ తదితర వసతులను మరింత మెరుగు పరచాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సగటున కనీసం 66 శాతానికి పైగా కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని అన్నారు. ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలకు సంబంధించి కూడా సంబంధిత కుటుంబీకులను కలిసి వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రతి గర్భిణీ మహిళ వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. గర్భిణీల వివరాలు నమోదు కాకుండా ఆస్పత్రుల్లో నేరుగా డెలివరీలు జరిగితే ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్ల ను బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. తమ పరిధిలో లేకపోయినప్పటికీ గర్భిణీ మహిళ గురించి సమాచారం తెలియగానే వారి వివరాలను రిజిస్టర్ చేయాలని సూచించారు. గడిచిన తొమ్మిది మాసాల నుండి ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న గర్భిణీలు, బాలింతల వివరాలు కెసిఆర్ కిట్ ఐడిలో పొందుపరచబడ్డాయా లేదా అన్నది పరిశీలిస్తూ నివేదిక అందించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రaాన్సీని ఆదేశించారు.
క్రమంతప్పకుండా గర్భిణీలు ఆరోగ్య పరీక్షలు జరుపుకునేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తహీనతకు లోనవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల హిమోగ్లోబిన్ టెస్ట్‌లు చేయించాలని, ఇందుకోసం అంగన్వాడి కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, స్త్రీ శిశు సంరక్షణ విభాగం పీ.ఓ డాక్టర్ అంజన తదితరులు పాల్గొన్నారు.