కామారెడ్డి, మే 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలలో గత నెల రోజుల నుండి సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్ ఉచిత శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవా భారతి ప్రాంత ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవ జీవితానికి సార్ధకత సేవమార్గమేనని, ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత వరకు తోటివారికి సహాయం చేయాలన్నారు.
కామారెడ్డి సేవా భారతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా శిక్షణా తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా, సమయపాలనతో చదివి టెట్లో అత్యధిక మార్కులు సాధించాలన్నారు. కష్టపడే తత్వం ఉన్నప్పుడు విజయం తప్పకుండా సిద్ధిస్తుందని విద్యార్థులకు సూచించారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో టెట్ కోర్స్ డైరెక్టర్ డాక్టర్ వేద ప్రకాష్ మాట్లాడుతూ ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు ధీటుగా సేవాభారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన శిక్షణను అందించామని శిక్షణను ఉపయోగించుకొని టెట్లో అత్యధిక మార్కులు సాధించి తద్వారా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలను సాధించాలన్నారు. విజయాన్ని సాధించే వరకు విశ్రమించకండి అన్నారు.
టెట్ మోడల్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి నవితకు 1500 రూపాయలను, రెండో బహుమతి భరత్ కుమార్ 1000 రూపాయలను, మూడో బహుమతి స్వప్న 500 రూపాయలను అందజేశారు.
కార్యక్రమంలో సేవాభారతి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజన్న, జైపాల్ రెడ్డి, విశిష్ట అతిథులు శంకర్, రాజేశ్వర్, కళాశాల డైరెక్టర్ అశోక్ రావు, ఆత్మీయ అతిథి డాక్టర్ సంగీత్ కుమార్, జిల్లా సేవా ప్రముఖ్, టెట్ సమన్వయకర్త మార బాల్ రెడ్డి, కుటుంబ ప్రభోధన్ ప్రముఖ్ రాజేందర్, విభాగ్ సంపర్క ప్రముఖ్ గోవర్ధన్ రెడ్డి, వ్యవస్థ ప్రముఖ్ శ్రీనివాస్, జిల్లా కార్యవాహ సంతోష్ రెడ్డి, అధ్యాపకులు బాలు, లక్ష్మీరాజ్యం, మల్లేష్, భాస్కర్, దేవి ప్రసాద్, పద్మావతి పాల్గొన్నారు.