ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న ఓపెన్‌ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 31 నుండి జూన్‌ 18వ తేదీ వరకు ఎస్‌ ఎస్‌ సి, ఇంటర్‌ ఓపెన్‌ ఎగ్జామ్స్‌ కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటల నుండి 11:30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినందున గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆర్‌ఎం కు సూచించారు.

పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాలన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్‌లను మూసి వేయించాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం లను ఎగ్జామ్‌ సెంటర్లలో నియమించాలని ఆదేశించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు డీసీపీ అరవింద్‌ బాబు, డీఐఈవో రఘురాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »