నిజామాబాద్, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న నిఖత్ జరీన్, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్లో మూడు గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన ఈషా సింగ్, ఇండియన్ ఫూట్బాల్ క్రీడాకారిణి సౌమ్య గూగులోత్లకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.
క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు తెలంగాణకు గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ప్రోత్సాహం, తల్లిదండ్రుల త్యాగం వీరి విజయం వెనుక ఉన్నాయని అన్నారు. ఎంతో అకుంఠిత దీక్షతో కష్టపడితే తప్పా ప్రపంచ స్థాయిలో రాణించలేరన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అన్ని రకాల ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య (బోధన్) లకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన శుభాకంక్షలు తెలిపారు. జిల్లాకే గర్వకారణం ముగ్గురు ఆడ బిడ్డలని వీరికి త్వరలో జిల్లాలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, టూరిజం వీణ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత, ధనలక్ష్మి, డా హరికృష్ణ,వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.