కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో టెట్ పరీక్ష ఏర్పాట్లపైసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో 5,356 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. జూన్ 12న పేపర్ 1 ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 46 మంది సూపరిండెంట్‌లను నియమించినట్లు చెప్పారు.
266 మంది ఇన్విజిలేటర్లను వివిధ శాఖల అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష సమయంలో విద్యుత్ ఉండే విధంగా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో
గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కమిషనర్ నీలి లింగం, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.