కామారెడ్డి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జూన్ 5న తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 90 వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటన వెలువరించడంతో పాటు కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్ 1 తదితర పోస్టులకు సంబందించి నోటిఫికేషన్లు జారీ చేసారని కావున నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని కోరారు.
తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 5న కామారెడ్డిలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు హాజరై గ్రూప్ 1,2 అధికారులు అందించే విలువైన సూచనలను పాటించాలని కోరారు. ఈ సందర్భం గా తెలంగాణ గ్రూప్ 1ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, హన్మంతు నాయక్లను అభినందించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్టివో వాణి, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, రాంకుమార్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.