నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే దిశగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ముగిసేంతవరకు పక్షం రోజులపాటు అధికారులందరూ వారికి కేటాయించిన కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరోగ్యపరమైన సమస్యలను మినహాయిస్తే ఇతర కారణాలతో ఎవరికీ సెలవులు మంజూరు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్లె ప్రగతి మొదటిరోజు కొనసాగిన కార్యక్రమాల అమలు తీరును అధికారులతో సమీక్ష జరిపారు. స్పెషల్ ఆఫీసర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారా లేదా అన్నది ఆరా తీశారు. ఆయా చోట్ల చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఒక్కో మండలం, మున్సిపాలిటీ వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికారులు తమ తమ కార్యస్థానంలోనే ఉంటూ టార్గెట్ షీట్‌కు అనుగుణంగా పనులు జరిగేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో మరో నాలుగైదు రోజుల లోపు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున విరివిగా మొక్కలు నాటేందుకు అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని అన్నారు. ఖాళీ ప్రదేశాల్లో గుంతలు తవ్వించి, ట్రీ గార్డులు, మొక్కలు, సపోర్ట్ కర్రలు సమకూర్చుకోవాలని సూచించారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలని, తిరిగి ఆ చెత్తాచెదారం మురుగు కాలువల్లోకి చేరకుండా వెంటదివెంట శివారు ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసేలోపు వైకుంఠదామాల్లో తాగునీరు, విద్యుత్ వసతి, మొక్కలు నాటే పనులు పూర్తి కావాలని పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణాలలో నాణ్యతతో పనులు జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఏ ఒక్క చోట కూడా వేలాడుతున్న విద్యుత్ తీగలు, శిథిలావస్థకు చేరిన కరెంటు స్తంభాలు ఉండకూడదని, అలాంటివాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయించాలని అన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువతో పాటు ఇతర చెరువులు, కాలువల గట్లపైన ముందుగా ఫార్మేషన్ రోడ్డు వేస్తూ సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలని, అనంతరం మొక్కలు నాటాలని దిశానిర్దేశం చేశారు. మండల, గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని, విధుల పట్ల అలసత్వం కనబర్చే వారిని సరెండర్ చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డిఆర్‌డిఓ చందర్, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.