కామారెడ్డి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయిని జిల్లాలో ఆదర్శ గ్రామం గా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామసభకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి గ్రామంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని సూచించారు.
గ్రామంలోని తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించాలని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో గ్రామంలో 90 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించడానికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పేర్కొన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.
అంతకుముందు గ్రామంలో పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సర్పంచ్ గంగారం, ఎంపీపీ దశరథ రెడ్డి, డిపిఓ శ్రీనివాస్, డిఎల్‌పిఓ సాయిబాబా, మండల రైతు బంధు అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఉపసర్పంచ్ సరస్వతి, విడిసి అధ్యక్షుడు నర్సింలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.