డిచ్‌పల్లి, జూన్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గారు ఇటీవల సివిల్స్ ఫలితాల్లో 136 వ ర్యాంక్ సాధించిన అరుగుల స్నేహను టీయూలోని పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నిజామాబాద్ పుట్టి పెరిగి, 10వ తరగతి వరకు నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో చదివారన్నారు.
2011 లో ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, చైతన్యపురి, హైదరాబాద్, 2013 లో బి.టెక్. ఎన్‌ఐటి నాగపూర్ (ఇఇఇ), 2017 పూర్తి సమయంలో పూర్తి చేశారన్నారు. తల్లి పేరు అరుగుల పద్మ. డేటా ఎంట్రీ ఆపరేటర్, పే అండ్ అకౌంట్ ఆఫీస్, కామారెడ్డిలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైన తల్లి ప్రోత్సాహంతో స్నేహ ఘనమైన విజయం సాధించారన్నారు.
టీయూలోని విద్యార్థులు స్నేహను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్నేహ మాట్లాడుతూ సింగిల్ పేరెంట్ (ఒకే తల్లి) కలిగిన కుటుంబం తమదన్నారు. ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ సిఎస్‌సి పరీక్షకు సిద్ధం కావడానికి పూర్తి మద్దతు తన తల్లి గారి నుండి పొందడం ప్రశంసనీయం అన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ ఇచ్చిన నైపుణ్యాల శిక్షణ కారణంగా వారి అమ్మకు ఉద్యోగం రావడంలో తాను చదువును కొనసాగించి, ఈ రోజు ఇంత ఉన్నత స్థితికి చేరుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.
తాను 2017 నుంచి సివిల్స్ పరీక్ష రాయడం ప్రారంభించి నేడు సివిల్స్ 136 వ ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. పుస్తకాల ప్రిపరేషన్ కంటే రివిజన్ మీద ఎక్కువ దృష్టి పెట్టానని అన్నారు. భవిష్యత్తులో మహిళా సాధికారతపై పని చేయాలని, విద్యానైపుణ్యాల మెరుగుదలకు కృషి చేయడానికి సంకల్పించుకున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో స్నేహ తల్లి పద్మని కూడా సన్మానించారు. ఇందులో స్నేహ బంధు వర్గం, స్నేహితులు, టీయూ అధ్యాపకులు, అధ్యాపకేతరులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.