నిజామాబాద్, జూన్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై పై అంశం పై చర్చించారు.
టూరిజం అభివృద్ధి సంస్థతో పాటు, అటవీ అభివృద్ధి సంస్థ కూడా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో టూరిజం స్పోర్ట్స్ ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నందున దీనికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుండి మొదలుకుని బినోల వరకు గల బ్యాక్ వాటర్ ఏరియా పరీవాహక ప్రాంతం గుండా అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వద్ద బ్యాక్ వాటర్ ఏరియాలో నీరు నిలిచి ఉండే ప్రాంతాన్ని మినహాయిస్తూ కనీసం 33 అడుగుల మేర రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదివరకే పరీవాహక ప్రాంతం అంతటా భూ సేకరణ చేసి ఉన్నందున రోడ్డు నిర్మాణానికి స్థల సమస్య అంతగా ఉత్పన్నం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. కేవలం రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్ధలాన్ని మాత్రమే సేకరించడం జరుగుతుందన్నారు. అది కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులను సంప్రదించి వారి సహకారంతో రోడ్డు నిర్మాణంకు అవసరమైన స్థలాన్ని సేకరించాలన్నారు.
రోడ్డు నిర్మాణం జరిగితే పరిసర ప్రాంతాల వ్యవసాయ భూముల విలువ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున రైతులు కూడా తోడ్పాటును అందిస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖా అధికారి సునీల్, డీఆర్డిఓ చందర్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.