నిజామాబాద్, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పల్లె ప్రగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశమ్మ వాగుకు ఆనుకుని వైకుంఠధామం వద్ద ఉపాధి హామీ కూలీల ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు.
వర్షాకాలంలో వాగు ద్వారా వచ్చే వరద జలాలను నిలువరించేందుకు వీలుగా పకడ్బందీ పనులు జరిపించాలని అధికారులకు సూచించారు. వైకుంఠధామం ప్రాంగణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఎగుడుదిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేసి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇదివరకు నాటిన మొక్కలు వాగు వరద జలాలకు కొట్టుకుపోయినందున సురక్షిత ప్రదేశాల్లో మొక్కలునాటి వాటిసంరక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చిస్తూ చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతమయ్యేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, మురుగు కాల్వల్లో పూడికతీత పనులు జరిపించాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి కింద కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ పరిశీలించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం (వాలీబాల్ కోర్ట్) ను పరిశీలించారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ భరత్, స్పెషల్ ఆఫీసర్ పోశెట్టి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమణ తదితరులు ఉన్నారు.