మన ఊరు – మన బడి అమలులో నిజామాబాదు జిల్లా ఆదర్శం

నిజామాబాద్‌, జూన్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలులో నిజామాబాద్‌ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆశాభావం వ్యక్తం చేశారు.

బుధవారం ఆమె కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మన ఊరు – మన బడి కింద కొనసాగుతున్న కిచెన్‌ షెడ్‌, డైనింగ్‌ హాల్‌ పనులను పరిశీలించి, స్థానిక అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల నిర్వహణ కమిటీల చైర్మన్లతో సమావేశమై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న పనులను బట్టి చూస్తే మన ఊరు – మన బడి అమలులో నిజామాబాద్‌ జిల్లా ఆదర్శంగా నిలువనున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి అవసరాల కోసం సంపును నిర్మిస్తూ, మిషన్‌ భగీరథ ద్వారా పైప్‌ లైన్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయిస్తుండడం పట్ల జిల్లా యంత్రంగాన్ని అభినందించారు.

మన ఊరు – మన బడికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నందున క్షేత్ర స్థాయిలో అమలు తీరును నిశితంగా పరిశీలన చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు తన సర్వీసులో చూడలేదని వెల్లడిరచారు. దీని ఔన్నత్యాన్ని గుర్తిస్తూ, మన ఊరు – మన బడిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ బడులలో మౌలిక వసతులను మెరుగుపరుచుకుని అన్ని విధాలుగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు.

పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని, పదేపదే మరమ్మతులకు ఆస్కారం ఉండరాదని సూచించారు. విద్యా శాఖా, ఇంజనీరింగ్‌ విభాగం, పాఠశాల నిర్వహణ కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో తొలి విడతలో 407 పాఠశాలలు మన ఊరు – మన బడి కింద ఎంపిక చేశామని చెప్పారు. వీటిలో 367 బడులకు ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశామని, 132 పాఠశాలలకు కొంత మేర నిధులను కూడా మంజూరు చేశామని చెప్పారు. దీంతో సదరు పాఠశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే పలుచోట్ల 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయని విద్యాశాఖ కార్యదర్శి దృష్టికి తెచ్చారు.

కిచెన్‌ షెడ్‌, టాయిలెట్స్‌, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నామని, మిగతా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల కోసం మన ఊరు – మన బడి నిధులను వెచ్చిస్తున్నామని వివరించారు. నిధులు ఏమాత్రం వృధా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, అవకాశం ఉన్నచోట పాత వాటికే మరమ్మతులు చేయిస్తూ సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

బిల్లుల చెల్లింపుల ప్రక్రియను సైతం పక్కాగా, పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతీ పని నిబంధనలకు లోబడి, నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కాగా, మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, ఆంగ్ల మాధ్యమ బోధనతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఎస్‌ఎంసి చైర్మన్లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

వారు ప్రస్తావించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వాకాటి కరుణ హామీ ఇచ్చారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్‌, ఎంఈఓలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నిర్వహణ కమిటీల చైర్మన్లు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »