నిజామాబాద్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్ పేషంట్ల వెంట ఒక అటెండెంట్ ను మాత్రమే అనుమతించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు.
ఎక్కువ సంఖ్యలో సహాయకులు ఉండడం వల్ల ఇతర అనేక రకాల ఇబ్బందులు ఉత్పన్నం అవుతున్నందున ఈ నిబంధనను తూచా తప్పకుండ అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ విభాగం సిబ్బందికి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ బాధ్యతలు పురమాయించాలని, మెయిన్ ఎంట్రన్స్ వద్దనే ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న అటెండెంట్‌లను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అవసరమైతే అటెండెంట్‌లకు పాస్‌లు జారీ చేయాలని సూచించారు. ఇన్ పేషంట్ల వెంట ఒకరికంటే ఎక్కువ మంది సహాయకులు ఉంటే ఆసుపత్రి సూపెరింటెండెంట్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆసుపత్రుల్లో ఓ.పీ విభాగం వద్ద, కారిడార్‌ల దగ్గర అటెండెంట్లు గుమిగూడి, పడుకుని కనిపించవద్దని, ఆసుపత్రి లోపలా, బయట ప్రాగణం అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ( టీఎస్‌ఎంఎస్‌ఐడిసి ) విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఇన్ పేషంట్లు, అవుట్ పేషంట్ల వివరాలను ఆన్ లైన్ పద్దతిలో నమోదు చేయాలని, దీనివల్ల పర్యవేక్షణ సులభం అవుతుందని సూచించారు.
ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు మొదలుకుని శానిటేషన్, సెక్యూరిటీ, పారామెడికల్, పేషంట్ కేర్ తదితర అన్ని విభాగాల సిబ్బంది హాజరుకు బయో-మెట్రిక్ పద్దతి పాటించాలని ఆదేశించారు. ఇకనుండి బయో-మెట్రిక్ హాజరు ఆధారంగానే జీతాలు చెల్లించడం జరుగుతుందని తేల్చి చెప్పారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నిర్వహణ, పర్యవేక్షణను సులభతరం చేసుకోవాలని హితవు పలికారు.
అన్ని ఆసుపత్రుల్లో తాగునీటి వసతిని మెరుగుపర్చుకోవాలని, చెడిపోయిన వాటర్ ప్లాంట్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని అన్నారు. విద్యుత్ వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలని, ప్రతి టాయిలెట్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, బయటి నుండి మందులు తెప్పించకూడదని ఆదేశించారు.
ఆసుపత్రుల్లోని ల్యాబ్ లలోనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆపరేషన్ థియేటర్‌లలో సదుపాయాలను మెరుగుపర్చుకోవాలని, ఇందుకు అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.