కామారెడ్డి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజా చేరువ రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులు, వ్యాపారవేత్తలు బ్యాంకు రుణాలు ఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. గృహ, విద్య, మహిళా సంఘాలకు, వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ చిందం రమేష్ మాట్లాడారు. అజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే వివిధ రకాల సేవల గురించి వివరించారు.
కేవైసీ, డిపాజిట్లు, రుణాల విస్తీరణ, భీమా వంటి సేవలపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాలకు వంద కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. పట్టణ మహిళా సంఘాలకు మూడు కోట్ల రుణాల చెక్కులు పంపిణీ చేశారు. రైతులకు రూ.150 కోట్ల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ డిడిఎం రమణ మూర్తి, రీజినల్ డివిజనల్ మేనేజర్ రాఘవేందర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, నాబార్డు డిడిఎం నగేష్, వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.