కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గురువారం కేంద్ర బృందం సందర్శించింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధుల వివరాల రికార్డులు చూశారు. పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రం సందర్శించారు.
పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి ఉండడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కోతుల ఆహార కేంద్రంలో గ్రామంలోని నర్సరీ నుంచి జామ, మామిడి, అల్లనేరేడు మొక్కలు పెట్టినట్లు సర్పంచ్ ధనలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. చెరువులో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులను పరిశీలించారు. కూలీల జాబ్ కార్డులను చూశారు.
పూడిక మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల తమకు ఎంతో ప్రయోజనం కలిగిందని రైతులు పేర్కొన్నారు. పూడిక మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయని రైతులు కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందంలో డైరెక్టర్ ధర్మవీర్జా, ప్రాజెక్ట్ అధికారులు అనుస్ల్ సుతార్, రాజ్ కుమార్ ప్రసాద్, రుచి సినహ ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ శరత్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, ఎంపీడీవో శంకర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.