నవీపేట్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుస ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న పనుల తీరును, స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను నిశితంగా పరిశీలన జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నవీపేట మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు.
నవీపేట మండల కేంద్రంలోని దర్యాపుర్‌లో గల మండల పరిషత్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను, తడగాం కాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మన ఊరు – మన బడి కింద కొనసాగుతున్న పనులను పరిశీలించి అధికారులు, గుత్తేదారుపై సూచనలు చేశారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, ఎక్కడ కూడా లోపాలకు ఆస్కారం ఉండకుండా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. గోడలకు పగుళ్లు కనిపించకూడదని, చెడిపోయిన గోడలకు కెమికల్ ట్రీట్మెంట్ చేసిన తరువాతే ప్లాస్టరింగ్ చేయాలని అన్నారు.
అనంతరం బినోల గ్రామంలోని ఆశాజ్యోతి కాలనీ సమీపంలో నిర్వహిస్తున్న బృహత్ పల్లె ప్రకృతివనం పరిశీలించారు. మొక్కల సంరక్షణ బాధ్యతలు సమర్ధవంతంగా కొనసాగిస్తుండడం పట్ల కలెక్టర్ గ్రామ కార్యదర్శిని, ప్రజాప్రతినిధులను అభినందించారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం సైతం పచ్చదనంతో కూడి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న మొక్కలను సంరక్షిస్తూ, ఖాళీ స్థలంలో మరిన్ని మొక్కలు నాటి వాటి నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. బృహత్ పల్లె ప్రక్రుతి వనం మొక్కలకు నీటి వసతి కోసం బోరు బావి ఏర్పాటు, ఇతర పనులకై కలెక్టర్ రూ. రెండు లక్షలు మంజూరు చేశారు. బినోల గ్రామపంచాయతీలో రికార్డులు పరిశీలించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు.
సర్కారు బడులకు సకల హంగులు
నవీపేటలో పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలకు సకల హంగులు సమకూరుతున్నాయని అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద జిల్లాలో తొలి విడతలో 407 పాఠశాలలు ఎంపికవగా, అందులో 132 స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తొలివిడతలో ఎంపికైన వాటిలో మొదటగా ప్రతి మండలంలో మూడు నుండి నాలుగు చొప్పున పాఠశాలల్లో పనులు జరిపిస్తున్నామని అన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 407 స్కూళ్లలోనూ సదుపాయాలన్నీ సమకూరి సకల హంగులను సంతరించుకోనున్నాయని వివరించారు. సర్కారు బడుల్లో సదుపాయాల కల్పనను మెరుగుపరుస్తూ, మరో వైపు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అమలులోకి రానుందని పేర్కొన్నారు.
అన్ని వసతుల నడుమ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులలోనే చదివించాలని కలెక్టర్ కోరారు. ఆయన వెంట నవీపేట ఎంపిడిఓ గోపాలకృష్ణ, బినోల గ్రామ సర్పంచ్ పీతాంబర్, పంచాయతీ కార్యదర్శి రానా తరన్నుమ్ తదితరులు ఉన్నారు.