నిజామాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో శివాజీనగర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీజిల్ ధరల పెంపును సాకుగా చూపి రెండుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచిందన్నారు. ఇప్పుడు మరోమారు డీజిల్ సెస్ పెంపు పేరుతో బస్సు చార్జీలు పెంచడం అన్యాయమన్నారు.
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను సామాన్యులు భరించలేక పోతున్నారన్నారు. ఇప్పటికే పెంచిన బస్సు చార్జీలతో అవస్థలు పడుతుంటే, మరోమారు విపరీతంగా చార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. అదేవిధంగా విద్యార్థుల బస్సు పాస్ చార్జీలు కూడా మూడిరతల పెంచడం దారుణమన్నారు. ఇవన్నీ కూడా ఆర్టిసిని ప్రజలకు దూరంచేయడంలో భాగమేనన్నారు.
అంతిమంగా సంస్థను నిర్వీర్యం చేసి, ప్రైవేటు పరం చేయడానికే ప్రభుత్వం కుట్రలు చేస్తుందని భావిస్తున్నామన్నారు. వెంటనే బస్సు చార్జీలు, బస్ పాస్ చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిచో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నాయకులు సాయగౌడ్, సంధ్యారాణి, మురళి, మారుతి గౌడ్, భాస్కర స్వామి, అశుర్, శకుంతల, రాజేందర్, గౌర, బాలరాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.