నిజామాబాద్, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఆశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై హరితహారం అమలుపై దిశా నిర్దేశం చేశారు.
రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురియనున్న దృష్ట్యా వచ్చే సోమవారం నుండి మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణాలో ఆరు శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందని, ఇదే స్పూర్తితో ముందుకు సాగుతూ మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని అధికారులకు హితవు పలికారు.
జిల్లా మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారుల పొడుగునా ఇరువైపులా ఈసారి మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. అదేసమయంలో ఇప్పటికే నాటిన మొక్కల నిర్వహణను పటిష్టపరుస్తూ, ఎక్కడైనా లోపాలుంటే సరిచేసుకోవాలన్నారు. చెరువులు, కాల్వ గట్ల పొడువునా మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయమై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ పరిధిలోని పది ఎకరాల భూమిలో ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి, జీపీల ద్వారానే నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
అలాగే, ఒక్కో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు వారి పరిధిలో మరో పది హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేశించాలని అన్నారు. ఇతర జిల్లా శాఖల అధికారులు తమ కార్యాలయాలతో పాటు ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు పండ్ల మొక్కలతో పాటు వేప, చింత, కానుగ రకాల మొక్కలు నాటించాలని, ఆయా కార్యాలయాలు అందాన్ని సంతరించుకునేందుకు పూల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
నాటిన మొక్కలను ఏడాది కాలం పాటు సంరక్షించేలా గట్టిగా కృషి చేస్తే, అనంతరం అవి వాటంతట అవే ఏపుగా పెరుగుతాయని పేర్కొన్నారు. నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, ముందుగా 44 వ నెంబర్ జాతీయ రహదారి ఇందల్వాయి నుండి మెండోరా వరకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు.
చిన్నాపూర్, సారంగాపూర్ వద్ద గల అర్బన్ పార్కులలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలని, ఎడపల్లి మండలం జానకంపేట్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలోనూ ఈసారి మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, డీఆర్‌డీఓ చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.