విధుల నిర్వహణ కోసం అటెండెన్స్‌ యాప్‌తోనే హాజరు

నిజామాబాద్‌, జూన్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర పరిధిలోకి వచ్చే వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశ్యంతోనే అటెండెన్స్‌ యాప్‌ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే పద్దతి కొనసాగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అటెండెన్స్‌ యాప్‌ ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయి నుండి పై స్థాయి వరకు అందరిని పని చేయించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.

విధులను సక్రమంగా నిర్వహించే వారికి అటెండెన్స్‌ యాప్‌ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, అనవసర భయాందోళనలకు లోను కావాల్సిన అవసరం లేదని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలు సాధించే వారికి జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా పూర్తి మద్దతుగా నిలుస్తుందని అన్నారు. కాగా, ప్రతి పీహెచ్‌సీ, హెల్త్‌ సబ్‌ సెంటర్‌లలో నీటి వసతి, విద్యుత్‌, టాయిలెట్స్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సొంత, అద్దె భవనాలు లేని కేంద్రాల వివరాలను నివేదిక రూపంలో పంపాలని సూచించారు. అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని, మందుల స్టాక్‌ కొంత మిగిలి ఉన్నప్పుడే సీడీఎస్‌ నుండి తెప్పించుకోవాలని హితవు పలికారు.

ప్రతి నివాస ప్రాంతంలోనూ గర్భిణీల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వారు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి స్థానికంగా ఉంటున్న గర్భిణీల వివరాలను కూడా జాబితాలో చేర్చాలని కలెక్టర్‌ సూచించారు. బోధన్‌, భీంగల్‌, నిజామాబాద్‌ అర్బన్‌ తదితర ప్రాంతాల్లో వలస వచ్చిన గర్భిణీల వివరాలను రెండు రోజుల్లో ప్రతి ఒక్కరి వివరాల నమోదు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలని, గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పని చేయాలన్నారు.

కాగా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కంటి వెలుగు కార్యక్రమం కింద ప్రతి రోజు కనీసం యాభైకు తగ్గకుండా క్యాటరాక్టు ఆపరేషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఆర్మూర్‌, బోధన్‌ ఏరియా ఆసుపత్రుల పరిధి నుండి పేషంట్లను ఆపరేషన్ల కోసం పంపించే సమయంలో వారి వెంట తప్పనిసరిగా ఆధార్‌, రేషన్‌ కార్డులు తీసుకుని వచ్చేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని రaాన్సీ, పీఓ డాక్టర్‌ అంజన, జిల్లా జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, ఆయా మండలాల వైద్యాధికారులు, సిబ్బంది, ఐసిడిఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »