జక్రాన్‌పల్లి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో మన ఊరు – మన బడి కింద కొనసాగుతున్న పనులను పరిశీలించి కీలక సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని, ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చాలావరకు పాఠశాల నిర్వహణ కమిటీలకే పనుల బాధ్యతలు అప్పగించినందున, ప్రభుత్వ బడులను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు.
గోడలకు ఎక్కడ కూడా పగుళ్లు కనిపించకూడదని, అలాంటిచోట్ల స్క్రబ్ చేయించిన తరువాతే ప్లాస్టరింగ్ పనులు జరిపించాలన్నారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, ఎస్‌ఎంసీ ప్రతినిధులు సొంత పనులుగా భావిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. కిటికీలు, తలుపులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని, పైకప్పు లీకేజీలు ఉండరాదని అన్నారు. ఇదిలావుండగా, పల్లె ప్రకృతి వనంలో గట్టి నేల ఉన్నచోట కూడా కొంత ఎరువులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తే మొక్కల పెంపకం సమర్ధవంతంగా చేపట్టవచని కలెక్టర్ నారాయణరెడ్డి సచివాలయ కార్యదర్శి అనిల్‌కు సూచించారు.
ఎరువులకు అవసరమైన నిధులను ఉపాధి హామీ ద్వారా వాడుకునే వెసులుబాటు ఉందన్నారు. గ్రామంలోని చెరువుకట్టపైన విరివిగా మొక్కలు నాటించాలన్నారు. డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేస్తూ ఎరువు తయారీ ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేలా చొరవ చూపాలని అన్నారు. అలాగే పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జక్రాన్‌పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్, తహశీల్దార్ మల్లేశ్, మనోహరాబాద్ సర్పంచ్ గంగాధర్, ఎస్‌ఎంసీ చైర్మన్ రవి తదితరులు ఉన్నారు.