కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తదానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్.కె. డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇతర జిల్లాల ప్రజలకు మన జిల్లా యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలని సూచించారు. యువత రక్తదానం చేసే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉండాలని, ఇతరులకు రక్తదానం చేస్తామనే ధైర్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతినిధులు సభ్యత్వ నమోదును ముమ్మరంగా చేపట్టాలన్నారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులు అందరూ రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం చేస్తే నీరసంగా ఉంటారనేది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. రక్తం పెరగాలంటే ఆకుకూరలు, బెల్లం, మొలకెత్తిన విత్తనాలు, క్యారెట్, బీట్రూట్, వేరుశెనగ తినాలని చెప్పారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన దాతలకు సన్మానం చేశారు.
ఆర్.కె. డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్త దానం ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి నాగరాజు గౌడ్, ఆర్.కె. కళాశాల సిఈవో జైపాల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ప్రతినిధులు రఘు కుమార్, బాలు, రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జమీల్ అహ్మద్, నరసింహ, అధ్యాపకులు పాల్గొన్నారు.