నిజామాబాద్, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర నుండి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పూర్తి నాణ్యతతో పనులు జరగాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అదే విధంగా భీంగల్ మండలం దేవక్క పేటలో అంతర్గతంగా రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న సి.సి డ్రైన్స్ పనులు,నూతన రోడ్డు నిర్మాణ పనులు మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతి పరిశీలించి,అధికారులకు పలు సూచనలు చేశారు.
అంతకు ముందు మానాల దేగావత్ తండాలో పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొనడానికి వెళ్తూ…మార్గ మధ్యలో రహత్ నగర్‌లో ఆగి గ్రామస్థులతో మంత్రి ముచ్చటించారు. పల్లె ప్రగతి జరుగుతున్న తీరును గ్రామ సర్పంచ్,కార్యదర్శి ని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల కోరిక మేరకు వారితో కలిసి టీ తాగారు. పలువురు గ్రామస్థులను పేరు పేరునా మంత్రి ఆప్యాయంగా పలకరించారు.