నిజామాబాద్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను పలుకరిస్తూ, భోజనం సక్రమంగానే అందిస్తున్నారా, రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు.
మన ఊరు – మన బడి నిధులతో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, పాఠశాలతో పాటు పరిసరాలను అందంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న జూనియర్ కళాశాల, పాఠశాలలకు ఆనుకుని చేరువలోనే ఉన్న పల్లె ప్రకృతి వనంను కలెక్టర్ సందర్శించారు.
భారీ వృక్షాలతో చక్కటి నీడను అందించే ఆహ్లాదకర ప్రాంగణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్, అక్కడ విద్యార్థుల సౌకర్యార్థం వారు కూర్చుని చదువుకునేందుకు వీలుగా సిమెంటు బెంచీల ను ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్సరీని పరిశీలించిన కలెక్టర్, మొక్కలు ఎండిపోకుండా వాటికి క్రమం తప్పకుండా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.