నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని గన్‌పూర్ గ్రామానికి చెందిన రాజరాజేశ్వరి చెరువును, నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఏదులా, ఎక్కుంట చెరువులను సమగ్ర సర్వేచేసి కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని, చెరువు చుట్టూ కందకం తవ్వించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ రూరల్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్.డి.ఓకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజాపంథా సబ్ డివిజన్ కార్యదర్శి సాయగౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం గన్‌పూర్ గ్రామానికి చెందిన రాజరాజేశ్వరి చెరువును నడ్పిల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఏదూల్లా చెరువు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. దీంతో చెరువులు ఆనవాళ్లను కోల్పోతున్నాయి. సాగు భూములకు పరిధిమేర కూడా నీరు వచ్చే పరిస్థితిలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో కబ్జాల పర్వం కొనసాగుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయకులకు ఈ భూములను అధిక ధరలకు అంటగడుతూ జేబులు నింపుకుంటున్నారన్నారు. ఈ కబ్జాల వల్ల ప్రజలు, రైతులు నష్టపోతున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారన్నారు. ఇదంతా స్థానిక రెవెన్యూ అధికారుల వైఫల్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెవెన్యూ అధికారులు కుమ్మక్కు కావడమే కారణమన్నారు.
తక్షణం ఈ చెరువులను 1975వ సంవత్సరం రెవెన్యూ రికార్డుల ప్రకారం సమగ్ర సర్వే జరిపించాలని, కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా నాయకులు ఎం.సుధాకర్, డివిజన్ నాయకులు బి.మురళి, డి.కిరణ్, నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.