నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్నారు.
ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, తాగునీటి వసతిని, రెగ్యులర్ వి.సి., విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని, హాస్టల్‌కి మరమ్మత్తులు, లైబ్రరీ, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తదితర డిమాండ్లతో విద్యార్థులు ప్రజాస్వామ్యయుతంగా దీక్షను కొనసాగిస్తున్నారన్నారు.
విద్యార్థులు రాత్రి, పగలు, ఆకలిని, ఎండ, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం మూడు రోజులుగా విద్యార్థులు దీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీలో పోలీసులను మోహరించి విద్యార్థి సంఘాలను, తల్లిదండ్రులను ఎవరిని క్యాంపస్లో అడుగుపెట్టనీయకుండా చేస్తూ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటాన్ని అణచివేయాలని కుట్రలు చేస్తోందన్నారు.
ప్రభుత్వ వైఖరిని పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఖండిస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, సీఎం, విద్యాధికారులు విద్యార్థులకు స్పష్టమైన హామీ ఇచ్చి విద్యార్థుల దీక్షను విరమింప చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా నాయకులు విజయ్, అశోక్, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు.