నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా సంవత్సరం ప్రారంభమై మన ఊరు – మనబడిలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్ ప్రదీప్ అన్నారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల సంఖ్యలో టీచర్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సంవత్సరాల తరబడి టీచర్, ఇతర విభాగాల్లో నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. వెంటనే ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అట్లాగే నోటిఫికేషన్‌లు వెలువరించాక దరఖాస్తు రుసుములు పరిమిత రుసుము ఉండేలా చూడాలని కానీ నిరుద్యోగుల నుండి కూడా దరఖాస్తు రుసుముల పేరుతో కోట్లాది రూపాయలు దండుకునే వైఖరి సరికాదన్నారు.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వంద రెండొందల లోపుగా అట్లాగే బీసీ అభ్యర్థులకు రుసుములో యాభై శాతం మినహాయింపు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రుసుము నుండి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో పివైఎల్ జిల్లా అధ్యక్షుడు బి.కిషన్, ప్రధాన కార్యదర్శి ఎం.సుమన్, ఉపాధ్యక్షులు మారుతీగౌడ్, సహాయ కార్యదర్శులు సాయిలు, నారయణ, అనీష్, కిరణ్, మనోజ్, భూమన్న, తారచంద్ తదితరులు పాల్గొన్నారు.