ప్రతి నివాస ప్రాంతంలో క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రావాలి

నిజామాబాద్‌, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నివాస ప్రాంతంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పల్లె ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలం లేనిచోట పాఠశాలలు, ఆలయాలు, గ్రామ చావిడి, కమ్యూనిటీ హాల్స్‌, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ స్థలాలను క్రీడా ప్రాంగణాల కోసం ఎంపిక చేయాలన్నారు.

స్థలాల గుర్తింపు పూర్తయిన చోట తక్షణమే పూర్తి వివరాలతో కూడిన ఎస్టిమేషన్లు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వచ్చే సోమవారం నాటికి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఎంపీవోలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. మోర్తాడ్‌, డిచ్పల్లి మండలాల్లో పూర్తిస్థాయిలో అన్ని హ్యాబిటేషన్‌ లలో క్రీడా ప్రాంగణాలు గ్రౌండిరగ్‌ చేయడం పట్ల సంబంధిత అధికారులను కలెక్టర్‌ అభినందించారు.

ఎంతో ప్రాధాన్యతతో కూడిన పనిగా దీనిని గుర్తిస్తూ, ఇతర మండలాల్లోనూ క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని హితవు పలికారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. కాగా, వైకుంటదామాలను వినియోగించుకునేలా చూడాలని, అవసరమైతే గ్రామ పెద్దలు, స్థానికులతో మాట్లాడాలని సూచించారు. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ నిర్మించినందున, నూటికి నూరు శాతం వాడకంలోకి రావాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కంపోస్ట్‌ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేస్తూ, ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయ వనరులు పెంపొందించాలని అన్నారు.

మోపాల్‌ మండలం సింగంపల్లి గ్రామ పంచాయతీ సేకరించిన చెత్త ద్వారా వేరు చేసిన వస్తువుల విక్రయం ద్వారా 35 వేల రూపాయల ఆదాయం ఆర్జించడం పట్ల కలెక్టర్‌ గ్రామ కార్యదర్శిని అభినందించారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను మళ్ళీ వినియోగంలోకి తేవడం వల్ల జీపీ లకు ఆదాయం సమకూరడమే కాకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారని అన్నారు. గ్రామ పంచాయతీలు చెత్త రీసైక్లింగ్‌ లో పోటీ పడాలని, ఇకనుండి తాను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని తెలిపారు. పల్లె ప్రగతి ముగిసినప్పటికీ, చేపట్టిన పరిశుభ్రత పనులు ఆగిపోకూడదని కలెక్టర్‌ సూచించారు.

అన్ని జీపీలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో గుర్తించిన ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. వారం రోజుల్లో మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. ఎక్కడ కూడా వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, విరిగిన, వంగిన విద్యుత్‌ స్తంభాలు ఉండరాదని అన్నారు. ఇరిగేషన్‌ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సమగ్ర కార్యాచరణతో సమాయత్తం కావాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, ట్రాన్స్‌ కో ఎస్‌ఈ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »