నిజామాబాద్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 21 న జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజల్లో యోగా చైతన్యాన్ని,అవగాహనను పెంపొందించడం కోసం నెహ్రూ యువ కేంద్ర మరియు ఆయాష్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన యోగ పాదయాత్ర అట్టహాసంగా జరిగిందని నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ ఛైర్మెన్ దాదన్న గారి విట్ఠల్ రావు పాల్గొని గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా మనకు అమృతం లాంటిదని, యోగా రోజూ చేయడం వలన మనం ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న అందరూ జిల్లా పరిషత్ చైర్మన్‌లలో తాను అందరికంటే పెద్ద వాడినని అయినప్పటికీ తాను ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటానని దానికి కారణం యోగా సాధనే అని పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్ర, ఆయుష్ విభాగం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని, తనను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
పాదయాత్ర గాంధీ చౌక్ నుండి ప్రారంభమై రాష్ట్రపతి రోడ్ మీదుగా కలెక్టర్ గ్రౌండ్ వరకు కొనసాగింది. మార్గమధ్యంలో యోగా సాధకులు చేసిన యోగ విన్యాసాలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయు. అనంతరం కలెక్టర్ గ్రౌండ్ లో పాదయాత్రలో పాల్గొన్న విద్యార్థులు,యోగా సాధకులకు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో అత్యల్పహారం అందించారు.
కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘు రాజ్, జిల్లా క్రీడా, యువజన అధికారి ముత్తేన్న, నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ రమణ మోహన్, యోగా గురువు రాంచందర్, ఆయుష్ సిబ్బంది, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, దయానంద యోగ కేంద్రం, వసుధ పాఠశాల, ఎన్‌సిసి వాలంటీర్లు, ఇన్నర్ వీల్ క్లబ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.