ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు

నిజామాబాద్‌, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాన్య ప్రజానీకానికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని మెరుగైన వసతులతో అధునాతనంగా తీర్చిదిద్దిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పేర్కొన్నారు. అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్‌, భీమ్గల్‌ మండలాల్లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి హరీష్‌ రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేల్పూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద మంత్రి వేముల, జెడ్పి ఛైర్మన్‌ విఠల్‌ రావు, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తదితరులు మంత్రి హరీష్‌ రావుకు ఘన స్వాగతం పలికారు. అక్కడే గల స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డి విగ్రహానికి హరీష్‌ రావు నివాళి అర్పించారు. అనంతరం వేల్పూర్‌ పీహెచ్‌సీని పరిశీలించిన మీదట మోతె గ్రామంలో బైపాస్‌ రోడ్‌కు, 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న మోతె – నడకుడ రోడ్‌ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మోతె గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భీంగల్‌ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మోతే, భీమ్గల్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి హరీష్‌ రావు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ అనవసర వ్యయ ప్రయాసలకు లోనుకావద్దని హితవు పలికారు. అవసరం లేకపోయినప్పటికీ సిజేరియన్‌ ఆపరేషన్‌లు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతోందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

సహజ ప్రసవాలే తల్లీ, బిడ్డకు ఎంతో శ్రేయస్కరం అని, ఈ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని సూచించారు. సిజేరియన్‌ ఆపరేషన్ల కారణంగా పుట్టిన బిడ్డకు అమృతతుల్యంతో సమానమైన ముర్రుపాలు అందకుండా పోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. అయినప్పటికీ కొంతమంది ముహూర్తాల ప్రకారంగా, మరికొందరు వేర్వేరు కారణాల వల్ల అవసరం లేనప్పటికీ సిజేరియన్‌ ఆపరేషన్‌లు చేయాల్సిందిగా డాక్టర్లను కోరుతున్నారని అన్నారు. ఈ వైఖరి ఎంత మాత్రం మంచిది కాదని, అత్యవసరమైతేనే సిజేరియన్‌లకు వెళ్లాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు.

గర్భిణీలు రక్తహీనత బారిన పడకుండా వారు గర్భం దాల్చిన నుండి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రైవేటు తో పోలిస్తే ప్రభుత్వాసుపత్రుల్లో నిపుణులైన వైద్యులతో పాటు ఆధునిక వైద్య పరికరాలు, అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నందున సుఖ ప్రసవాల కోసం గర్భిణీలు ప్రభుత్వాసుపత్రుల సేవలు వినియోగించుకోవాలని హితవు పలికారు. కాన్పు కోసం ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లకు వెళితే ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయని, దీనివల్ల ఆర్థిక భారంతో పాటు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా కాన్పులు చేస్తూ కెసిఆర్‌ కిట్‌ ద్వారా 12 వేల రూపాయల ప్రోత్సాహకం కూడా అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ప్రభుత్వాసుపత్రిలో 30 శాతానికి పరిమితమైన కాన్పులు ప్రస్తుతం 60 శాతానికి పెరిగాయన్నారు. అయితే వీటిని 70 నుండి 80 శాతానికి పెంచడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు అన్ని ఆసుపత్రులతో పాటు ప్రతి పీహెచ్‌సీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. వీటిని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటేనే తమకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. కాగా ఇటీవలి కాలంలో అనేక మంది రక్తపోటు, మధుమేహం వ్యాధుల బారిన పడుతున్నారని మంత్రి హరీష్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీపీ, షుగర్‌ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇళ్ల వద్దనే ఎన్‌ సి డి కిట్‌ లను అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహరహం కృషి చేస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త పెన్షన్‌ లు మంజూరు చేయడంలో జాప్యం జరిగిందని, ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు.

నివేశన స్థలం కలిగి ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు.ఈ సందర్భంగా మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ గోడ, వెయిటింగ్‌ రూం ల నిర్మాణాల కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. వేల్పూర్‌, భీమ్గల్‌ మండలాలతో తనకు గల అనుబంధాన్ని, స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డి తో నెరిపిన సాన్నిహిత్యం గురించి హరీష్‌ రావు నెమరువేసుకున్నారు.

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, కోరిన వెంటనే మోతే పి హెచ్‌ సి తో పాటు భీమ్గల్‌ లో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు, మంత్రి హరీష్‌ రావు కు కృతజ్ఞతలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన మొట్టమొదటి గ్రామమైన మోతే అంటే సీఎం కేసీఆర్‌ కు ఎనలేని అభిమానం కావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు కోరిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.

నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా ఇప్పటికే 90 శాతానికి పైగా పనులు పూర్తి చేయగలిగానని పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ హామీని కూడా నిలుపుకునే దిశగా కృషి చేస్తున్నట్లు మంత్రి వేముల తెలిపారు.

కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఆకుల లలిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎల్‌ ఎం బి రాజేశ్వర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఆర్మూర్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »