నిజామాబాద్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్ రావు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల ఐసీయూ విభాగాన్ని, వృద్దుల కోసం నెలకొల్పిన లాలన కేంద్రాన్ని, స్కిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆనంతరం ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వైద్య శాఖ రాష్ట్ర కమిషనర్ శ్వేతా మహంతి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులతో కలిసి జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఒక్కో విభాగం వారీగా సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకుంటూ, లోటుపాట్లు ఉన్నచోట తక్షణమే వాటిని సరి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. 70 సంవత్సరాలలో తెలంగాణాలో కేవలం నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ లలో మాత్రమే మెడికల్ కాలేజీలు ఏర్పాటవగా, తెలంగాణ వచ్చాక తమ ప్రభుత్వం కేవలం 7 సంవత్సరాల వ్యవధిలో 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని అన్నారు.
ఇదివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 780 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ఆ సంఖ్యను 2840 కు పెంచుకున్నామని, వచ్చే సంవత్సరానికి సీట్ల సంఖ్య 5240 కు పెరుగనుందని వివరించారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలలోను సీట్ల సంఖ్య రెట్టింపు అయ్యిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ విధానం యావత్ దేశానికే ఆదర్శంగా మారిందని, బస్తీ దవాఖానాలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో కాన్పులకు సంబంధించి 99.9 శాతం ప్రగతితో తెలంగాణ నెంబర్ వన్‌లో కొనసాగుతోందని తెలిపారు.
మొత్తంగా చూస్తే వైద్య రంగంలో కేరళ, తమిళనాడు తరువాత తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో ఉందన్నారు. మాతా శిశు మరణాల రేటు కుదింపులో తమిళనాడును వెనక్కి నెట్టి తెలంగాణ ముందంజలో ఉందన్నారు. అయితే ఇంకనూ వైద్య శాఖలోని అనేక విభాగాల్లో పని తీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను 30 నుండి 60 శాతానికి పెంచుకోగలిగామని, దీనిని కనీసం 75 శాతానికి పెంచాలనే లక్ష్యంతో పక్కాగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గైనిక్ విభాగం బలోపేతానికి 408 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇంతలా కృషి చేస్తున్నప్పటికీ అక్కడక్కడా చిన్నచిన్న లోపాలు, అలసత్వాల కారణంగా వైద్య శాఖకు చెడ్డ పేరు వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులను బయటకు పంపకూడదని, మందులు బయటకు రాయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేవలం మందుల కోసమే ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని, 700 రకాల మందులను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
అయినప్పటికీ రోగులను బయట నుండి మందులు తెచ్చుకోవాలని ఎవరైనా చీటీలు రాస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రతి ఆసుపత్రి, పీహెచ్ సీ లలో శానిటేషన్ వ్యవస్థను చక్కదిద్దుతూ, నిర్వహణను మెరుగుపరుచుకుంటే చాలా వరకు ప్రభుత్వ వైద్య సేవల్లో మరింత గణనీయమైన మార్పు వస్తుందని సూచించారు. డైట్, శానిటేషన్ కోసం చెల్లించే మొత్తాన్ని దాదాపుగా రెట్టింపు చేసినందున నాణ్యమైన సేవలందేలా పర్యవేక్షణ జరపాలన్నారు.
కాగా, ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వాసుపత్రుల్లో ఎంత ఎక్కువ వైద్య సేవలు అందిస్తే, ఆసుపత్రికి అంత ఎక్కువ ఆదాయ వనరులు సమకూరుతాయని మంత్రి హరీష్ రావు హితవు పలికారు. గాంధీ, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో నెలకు రెండు కోట్ల రూపాయల వరకు ఆర్జిస్తున్నారని, ఈ నిధులను పూర్తిగా ఆసుపత్రుల అభివృద్ధి కోసం వెచ్చించుకునే వెసులుబాటు కల్పించామని అన్నారు. ఆసుపత్రుల్లో ఏవైనా పరికరాలు చెడిపోతే తక్షణమే మరమ్మతులు చేయించాలని సూచించారు. ఈ దిశగా ప్రాజెక్ట్ మేనేజిమెంట్ యూనిట్ (పీఎంయూ) ను నెలకొల్పుతున్నామని మంత్రి తెలిపారు.
వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు పెద్ద ఎత్తున నియామకాల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచుతూ, అనవసరంగా సిజీరియన్లు జరుగకుండా చూడాలని హితవు పలికారు. క్రమం తప్పకుండ గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు జరిగేలా, వారికి పౌష్టిక ఆహారం అందిస్తూ, పరిమిత వ్యాయామాలు చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు.
హైదరాబాద్‌లోని ఫెర్నాన్ డెజ్ ఆసుపత్రి పై పద్ధతులను పాటిస్తూ 85 శాతం సాధారణ ప్రసవాలు చేస్తోందని ఉదహరించారు. వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. టీ.డయాగ్నోసిస్ కింద ఆయా రకాల పరీక్షల కోసం సాంపిల్స్ సేకరించిన రోజునే వాటి ఫలితాలు వైద్యునికి, పేషంటుకు అందేలా చూడాలన్నారు.
త్వరలోనే 13వేల డాక్టర్ల ఖాళీలు భర్తీ చేస్తామని, ప్రభుత్వం కేటాయించిన వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప సిజీరియన్ ఆపరేషన్లకు వెళ్లకూడదని, సిజేరియన్ లలో తెలంగాణ రాష్ట్రం ముందు ఉండటం ఆందోళన కలిగించే పరిణామమని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి నుండి ఆశా వర్కర్స్, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలన్నారు.
ప్రయివేటు ఆసుపత్రులలో వందకు వంద శాతం సి సెక్షన్లు చేస్తున్నారని, ఇకపై వీటిని తగ్గిస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ సహజ కాన్పులు జరిగేలా చొరవ చూపాలన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శాస్త్ర చికిత్సలు చేయడం పట్ల మంత్రి హరీష్ రావు అభినందించారు.
సమీక్ష సమావేశంలో రాజ్యసభ సభ్యులు కె ఆర్.సురేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్త, జీవన్ రెడ్డి, షకీల్ ఆమీర్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీ.గంగాధర్ గౌడ్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల లలిత, డీఎంఏ రమేష్ రెడ్డి, మేయర్ నీతూ కిరణ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.