ఉద్యమ కాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టమీదే

బాల్కొండ, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్ల మరమ్మత్తుల పనులను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. సుమారు 17.40 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. డ్యాం మీద అధికారులతో,రైతులతో కలిసి కాలి నడకన కలియ తిరిగారు.

ఈ సంధర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ కాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టమీదే అని నాటి జ్ఞాపకాలు మంత్రి గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని అయిన ఎస్సారెస్పీ సందర్శనకు 1996 లో కేసిఆర్‌ వచ్చినప్పుడు తుప్పు పట్టిన గేట్లను, డ్యాం మీద గుంతలు,సేఫ్టీ వాల్‌, డ్యాం కట్ట బలంగా ఉండే రాళ్ళు అస్తవ్యస్తంగా ఉండడాన్ని చూసి, ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవ ఆలయాలు,తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల తీరు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసునట్లు చెప్పారు.

కట్టలు తెంచుకున్న ఆవేశంతో 1996 లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు పెట్టాలని ఆలోచన చేశారన్నారు.కేసిఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్న లోతైన ఆలోచన, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రారంభిస్తారన్నారు. నాడు ప్రాణ హిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో నిజామాబాద్‌, కామారెడ్డి ప్రాంతంలో 4 లక్షల ఏకరాలకు నీళ్లు ఇస్తామని మోసపు మాటలు చెప్పారని గుర్తు చేశారు.

ప్రాజెక్టులో 20 టిఎంసిల నీరు ఉంటేనే తోడి పోసుకునే విధంగా కుట్రపూరితమైన డిజైన్లు రూపకల్పన చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల డైరెక్ట్‌ వరద కాలువ ద్వారా నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వివరిస్తే దాన్ని పరిశీలించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్‌,హెల్దీవాగు,నిజాంసాగర్‌ ద్వారా 400 మీటర్ల ఎత్తు నుంచి నీటిని తేవాలని ఆలోచన చేసిన, 2017 లో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుట్టారని, దీని ద్వారా కేవలం 40 మీటర్ల ఎత్తు నుంచి వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ నింపుకుంటున్నమని అన్నారు.

దీని వెనుక ఎంత అంతర్మథనం జరిగిందో ఆయకట్టు రైతులు అర్దం చేసుకోవాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం కేసిఆర్‌ ఎంతగా ఆలోచిస్తారో అనే దానికి ఎస్సారెస్పీ ని నిండు కుండలా నింపుకోవడమే నిదర్శనం అన్నారు. అట్లాగే నేడు సుమారు 42 కోట్లతో డ్యాంకు అన్ని రకాల రిపేర్లు చేసుకున్నామని, గుంతలు లేకుండా అద్దం లాంటి రోడ్లు వేసుకున్నామని,సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ దయతో నేడు 17.40 కోట్ల వ్యయంతో గేట్లు మరమ్మత్తులు చేసుకుంటున్నామని తెలిపారు.

కార్యక్రమంలో ఎస్సారెస్పీ సి.ఈ సుధాకర్‌ రెడ్డి, ఎస్‌.ఈ శ్రీనివాస్‌, ఈ.ఈ పలువురు బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »