నందిపేట్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. తొలకరి వానలకు డొంకేశ్వర్, నూత్‌పల్లి, గాదేపల్లి తదితర గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న పంట వేశారు. వారం రోజులైనా వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. విత్తిన విత్తనాలు ఉడికిపోతాయేమోనని భయపడ్డారు. అయితే ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతులు కొంత ఊరట చెందారు.
చాలా గ్రామాల్లో భూములు చదునుచేసుకొని విత్తనాలు వేసుకోవడానికి సిద్దమవుతున్నారు. నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో వర్షాలు కురవడం ఆలస్యమైంది. ఆదివారం కురిసిన వానతో రైతుల్లో ఆనందం కనిపించింది. కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గ్రామాల్లో దున్నడం, విత్తనాలు అలకడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి కురిసిన వాన వల్ల కాంప్లెక్స్ ఎరువులు ఈపాటికే తెచ్చుకోని రైతులు ఎరువుల కోసం దుకాణంలో క్యూ కట్టడం కనిపించింది.