నిజామాబాద్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారులందరూ పక్షం రోజులపాటు తీవ్రంగా శ్రమిస్తూ, సమిష్టి కృషితో మంచి ఫలితాలు సాధించగలిగారని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అంకిత భావంతో కృషి చేశారని కొనియాడారు. ఇకపై కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతిలో అక్కడక్కడా మిగిలిపోయిన పెండిరగ్ పనులను పూర్తి చేయిస్తూనే, హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పల్లె / పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్‌కు సంబంధించి ఖాళీ ప్రదేశాలు, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నటించాలని సూచించారు.
ప్రధానంగా ఈ దఫా హరితహారంలో 141 బృహత్ పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దీంతోపాటు కాలువలు, చెరువు గట్ల వెంబడి మొక్కలు నాటేలా సమగ్ర అంచనాలతో ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని 106 గ్రామపంచాయతీల పరిధిలో పది ఎకరాల చొప్పున అటవీ భూమిలో జీపీల ఆధ్వర్యంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లా మీదుగా వెళ్తున్న రెండు జాతీయ రహదారులకు ఇరువైపులా ఈసారి మల్టీ లేయర్ గా అందమైన పూల మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు.
అలాగే, ప్రతి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ పరిధిలో పది హెక్టార్ల చొప్పున విస్తీర్ణంలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతూ, ఇదివరకు నాటిన మొక్కల సంరక్షణ చర్యలను పటిష్టపర్చాలన్నారు. చిన్నాపూర్, సారంగాపూర్ లలో గల అర్బన్ పార్కులలోనూ ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ లో భాగంగా ట్రాన్స్ కో కార్యాలయాలు, రైతు వేదిక భవనాల ఆవరణలలో విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. పెండిరగ్ పనులను పూర్తి చేయిస్తూనే, హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, పాఠశాలలు పునః ప్రారంభం అయిన దృష్ట్యా జిల్లా విద్యాశాఖ, రెసిడెన్షియల్, సంక్షేమ శాఖల అధికారులు శాఖాపరమైన విధుల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఆయా సంక్షేమ వసతి గృహాల్లో సుమారు రెండు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ మరమ్మతులు జరిపిస్తున్నందున, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు.
మన ఊరు – మన బడి కింద కొనసాగుతున్న పనులన్నీ నిర్దేశిత ప్రమాణాలకు లోబడి జరగాలన్నారు. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కల్తీ విత్తనాలకు ఆస్కారం లేకుండా గట్టి నిఘాను కొనసాగిస్తూ, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.