కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 72 శాతం రుణ వితరణ లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 2021-22 వార్షిక సంవత్సరం బ్యాంకుల రుణ వితరణ పనితీరుపై మంగళవారం బ్యాంక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ.4778 కోట్లకు ఇప్పటికి రూ.3442 కోట్లు రుణ వితరణ చేసి 72 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు.
ప్రాధాన్యత రంగాలైన గృహ, వ్యాపార, మహిళా సంఘాలకు ఆశించినంత మేరకు రుణ వితరణ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు వంద శాతం పంట రుణాలు బ్యాంకర్లు అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖలో పెండిరగ్ రుణాలను సత్వరమే అందించాలని పేర్కొన్నారు.
సమావేశంలో ఎల్డిఎం చిందం రమేష్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం రహమాన్, నాబార్డు డిజిఎం నగేష్, డిసిసిబి డిజియం బ్రహ్మానంద రెడ్డి, కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ శ్రీనివాస రావు, ఇతర బ్యాంకుల అధికారులు, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, పారిశ్రామిక శాఖ, మెప్మా, డిఆర్డిఎ అధికారులు పాల్గొన్నారు.