కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం కేంద్రీయ భూగర్భజల బోర్డు ప్రజలతో చర్చా గోష్టి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకొని వర్షపు నీరు వృధా కాకుండా చూడాలన్నారు. రైతులు తమ పొలాల్లో పాంపౌండ్స్ నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు దోహదపడాల న్నారు. తక్కువ నీటితో పండిరచే ఆరుతడి పంటలు రైతులు సాగు చేసుకోవాలని సూచించారు. రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల నీరు కలుషితమయ్యే వీలుందని పేర్కొన్నారు.
రైతులు పందిరి విధానంలో కూరగాయల సాగు చేపట్టి లాభాలు పొందాలని సూచించారు. బిందుసేద్యం ద్వారా పంటలను సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా లోని భూగర్భ జలాల పైన నివేదికను సిజిడబ్ల్యుబి సైంటిస్ట్ విటల్, మాధవ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. నివేదిక పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
సమావేశంలో సిపిఓ రాజారాం, జిల్లా భూగర్భజలాల అధికారి సతీష్ యాదవ్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యాన అధికారి సంజీవ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.