ప్రసవాలు జరుగని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది జీతాలు నిలుపుదల చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరం లేకపోయినా సిజీరియన్‌ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో నూటికి నూరు శాతం సీజీరియన్‌ కాన్పులే జరుగుతున్నాయని, ఈ పరిస్థితిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

జిల్లాలో సగటున 77 శాతం సిజీరియన్లు జరుగుతున్నాయని, రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో ఎంతో ఎక్కువ మోతాదులో సీజీరియన్లు అవుతున్నాయని కలెక్టర్‌ ఒకింత ఆందోళన వెలిబుచ్చారు. సిజీరియన్‌ లలో ప్రైవేట్‌ విభాగంలోనే అత్యధిక మోతాదులో జరుగుతున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇకనుండి ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ లో జరిగే సిజీరియన్‌ కాన్పులపైనా క్షుణ్ణంగా పరిశీలన జరిపిస్తామని అన్నారు. ఎక్కడైనా అవసరం లేనప్పటికీ సిజీరియన్‌ చేసినట్లు పరిశీలనలో తేలితే అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలకు దిగుతామని, ఈ విషయంలో ఎలాంటి మొహమాటానికి తావుండబోదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

సదరు ఆసుపత్రుల్లో అన్నీ సిజీరియన్లే జరుగుతాయని, సాధారణ కాన్పులు చేయరు అని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కాగా, అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా వైద్యాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. పలు పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో వంద శాతం కాన్పులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని, ఇలా ఎందుకు అవుతోందని కలెక్టర్‌ సంబంధిత వైద్యాధికారులను నిలదీశారు.

వచ్చే జూలై మాసం నుండి 50 శాతానికి మించి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగితే సంబంధిత సబ్‌ సెంటర్‌, పిహెచ్‌సిలలో పని చేసే వైద్యులు, సిబ్బంది వేతనాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. క్షుణ్ణంగా విచారణ జరిపిన మీదట తప్పిదాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, మిగతా వారికి వేతనాల పంపిణీకి అనుమతిస్తామని అన్నారు. ప్రస్తుత జూన్‌ మాసంలో వంద శాతం ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో ప్రసవాలు జరిగిన పీహెచ్‌సిలు, హెల్త్‌ సబ్‌ సెంటర్‌ల సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అనుమతి లేకుండా వేతనాలు విడుదల చేయకూడదని కలెక్టర్‌ వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అనేక మంది అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, కొద్దిమంది చేసే తప్పుల వల్ల మొత్తం శాఖకు, జిల్లా యంత్రాంగానికి అపవాదు వస్తోందని, దీనిని ఎంతమాత్రం సహించబోమని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. గర్భిణీల నమోదుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు గట్టిగా కృషి చేయాలని సూచించారు.

అలాగే గర్భిణీలకు క్రమం తప్పకుండ ఆరోగ్య పరీక్షలు జరిగేలా పర్యవేక్షణ చేస్తూ, విధిగా వారి రక్త నమూనాలను సేకరించి డీ-హబ్‌ కు పంపించాలని ఆదేశించారు. గర్భిణీలు రక్తహీనత బారిన పడకుండా ముందునుండే వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ తగిన చికిత్సలు, పోషకాహారం అందేలా చూడాలన్నారు. రక్తపోటు, మధుమేహం బారిన పడినవారికి అవసరమైన మందులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వైద్యాధికారులకు సూచించారు.

టీబీ, లెప్రసీ, ఫైలేరియా వ్యాధుల నిర్ధారణ కోసం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా శాంపిళ్ళ సేకరణ జరగాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం కింద ప్రతి రోజు కనీసం యాభై మందికి క్యాటరాక్టు ఆపరేషన్‌లు చేయాలని లక్ష్యం విధించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అంజన, మహిళా శిశు సంక్షేమ అధికారిని రaాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »