నిజామాబాద్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు యోగాను తమ జీవితంలో భాగంగా మల్చుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర, ఆరోగ్య రక్ష, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, ఆయుష్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జిల్లా యువజన, క్రీడలు, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్‌లో యోగా కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఎంతో అలవోకగా యోగాసనాలు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి యోగాచార్యులు రాంచందర్, సిద్ధిరాములు వివరించారు. యోగ సాధన చేస్తున్న యువతులు, విద్యార్థినులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు అబ్బురపరిచాయి. అనితర సాధ్యం అనిపించే కఠినమైన ఆసనాలను సైతం ఎంతో సునాయాసంగా, చూడచక్కని రీతిలో ప్రదర్శించిన చిన్నారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఐఏఎస్ శిక్షణ సమయం నుండి తాను కూడా యోగాను అలవాటు చేసుకున్నానని తెలిపారు. ఇటీవలి కాలంలో కొంత విరామం వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ యోగా ప్రదర్శనను చూసిన తర్వాత తిరిగి క్రమం తప్పకుండా యోగా చేయాలని అభిలాష ఏర్పడిరదన్నారు. పూర్వ కాలం నుండే యోగ మన దేశ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. యోగ విద్య ఆరోగ్యాలను పరిరక్షించడమే కాకుండా భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతోందని అన్నారు.
నేటి ఆధునిక కాలంలో పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తుండటంతో అనేక మంది యోగాకు దూరంగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు. లెక్కకు మిక్కిలి లాభాలను అందించే యోగాను ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. యోగాకు వయసుతో సంబంధం ఉండదని అన్నారు. ప్రస్తుత సమాజంలో మనం తీసుకుంటున్న ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు పూర్తిగా స్వచ్ఛమైనవి అని విశ్వసించే పరిస్థితి లేదని కలెక్టర్ పేర్కొన్నారు.
కలుషిత పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను కూడా యోగా ద్వారా నివారించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌వైకె సమన్వయకర్త శైలి బెల్లాల్, ఆయుష్ విభాగం వైద్యాధికారి రమణ మోహన్, రెడ్ క్రాస్ ప్రతినిధి తోట రాజశేఖర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.