అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు

నిజామాబాద్‌, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రధాన జలాశయాలకు చెందిన మెయిన్‌ కెనాళ్లతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు ఇరువైపులా ఆక్రమణలను తొలగిస్తూ, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.

హరితహారం కార్యక్రమంపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరిగేషన్‌, ఉపాధి హామీ, రెవెన్యూ, మండల పరిషత్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈసారి హరితహారంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కాలువలు, చెరువులకు చెందిన స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని నిర్దేశించిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కాలువలు, చెరువుల హద్దులను గుర్తిస్తూ, ట్రెంచ్‌ కట్టింగ్‌ జరిపించాలని సూచించారు.

వారం రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని గడువు విధించారు. ఇప్పటివరకు కాలువలు చెందిన స్థలాల్లో ఇకపై పంటల సాగును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అన్నారు. రైతులకు చెందిన కాల్వలకు ఆనుకుని ఉన్న పట్టా భూముల్లో ఒక్క అంగుళం స్థలాన్ని కూడా తీసుకోబోమని, కేవలం కెనాల్‌ పరిధిలోని ఆక్రమణలను మాత్రమే తొలగిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారంలో భాగంగా మొక్కలు నాటాల్సి ఉన్నందున ఆక్రమణకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేయాల్సిందేనని కలెక్టర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఇరిగేషన్‌ ఏఈలతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తక్షణమే ఆక్రమణల తొలగింపు పనిలో నిమగ్నం కావాలని బాధ్యతలు పురమాయించారు. ముందుగా కాలువలు, చెరువు గాట్లతో పాటు, వాటి పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తిస్తూ, ఉపాధి హామీ కూలీలచే ట్రెంచ్‌ కట్టింగ్‌ జరిపించాలని, పిచ్చి మొక్కలు, పొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి మూడు మీటర్లకు ఒక మొక్క చొప్పున నాటేందుకు వరుస క్రమంలో గుంతలు తవ్వించాలని సూచించారు.

జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీల పరిధిలో 652 కిలోమీటర్ల మేర కెనాల్‌ బౌండరీ ఉందని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ దఫా హరితహారంలో రెండు కిలోమీటర్ల పొడుగునా కాలువకు ఇరువైపులా మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రెండు కిలోమీటర్ల మేర కాలువ స్థలం లేని చోట చెరువు గట్ల పైన మొక్కలు నాటాలని అన్నారు.

వర్షాలు ప్రారంభం అయినందున మొక్కలు నాటడంలో జాప్యానికి తావు లేకుండా చూడాలని కలెక్టర్‌ హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో ఇరిగేషన్‌ ఎస్‌ఈ బద్రీ నారాయణ, ఉపాధి హామీ అధికారి సంజీవ్‌, వివిధ శాఖలకు చెందిన ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »