నిజామాబాద్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ సాటర్స్, ట్రై పిల్లర్, క్లర్క్స్ మొదలగు కేటగిరీలకు చెందిన బీడీ కార్మికుల వేతన ఒప్పందం 30.04.2022న ముగిసింది. కొత్త వేతన ఒప్పందం కోసం మంగళవారం 21.06.2022న బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుజరాతి భవన్లో చర్చలు జరిగినాయి.
చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు 2 వేల 800 రూపాయలకు, నెలసరి జీతం ఉద్యోగులకు 1500 రూపాయల చొప్పున వేతనాల పెంపునకు మరియు బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు మూడు రూపాయల చొప్పున కూలి రేట్ల పెంపునకు అగ్రిమెంట్ కుదిరింది. కొత్త అగ్రిమెంటు 01.05.2022 నుండి 30.04.2024 వరకు అమలులో ఉంటుంది. పెరిగిన వేతన మే నెల బకాయిలు వచ్చే ఆగస్టులో ఇవ్వాలని అగ్రిమెంటు కుదిరింది.
చర్చల్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు)రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న, శ్రీశైలం రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.వెంకన్న, రాష్ట్ర కోశాధికారి రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు రామ్ లక్ష్మణ్, బి. మల్లేష్, సత్తెక్క, బక్కన్న, లింగం బీడీ యజమానుల సంఘం అధ్యక్షులు ఇతేంద్ర ఉపాధ్యాయ, దేశాయ్ బీడీ ప్రొడక్షన్ మేనేజర్ రష్మీకాంత్ పటేల్ మరియు సి.ఐ.టియు రాష్ట్ర కార్యదర్శి రమ, ఎల్లయ్య, టి.ఆర్.ఎస్.కే.వి బాధ్యులు నర్సింలు, బి.ఎం.ఎస్ రాష్ట్ర బాధ్యులు కలాల్ శ్రీనివాస్, ఏ.ఐ.ఎఫ్.టి.యు నాయకులు అనసూయ, లింగం, బి.ఎల్. టి.యు రాష్ట్ర కార్యదర్శి సిద్దిరాములు, ఇతర సంఘాల నాయకులు స్వామి, టీ. బాల్ రాజ్, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు)రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికుల, ప్యాకర్లు, ఉద్యోగుల ఐక్యత వల్లనే కూలీరేట్లు పెరిగాయన్నారు. బీడీ కార్మికులకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలన్నారు.