నిజామాబాద్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్యకర సమాజం కోసం సహజ కాన్పులను ప్రోత్సహిద్దామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజేరియన్ ఆపరేషన్‌ల నియంత్రణకు కలిసికట్టుగా కృషి చేస్తూ, నేటితరం మహిళల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను, హరితహారం విజయవంతానికి రూపొందించిన ప్రణాళికలు, మన ఊరు – మన బడిలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో కొనసాగుతున్న మౌళిక వసతుల కల్పన పనుల గురించి, ఉపాధి హామీ అమలు తీరు, సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖను గాడిన పెట్టేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు తదితర అంశాల గురించి కలెక్టర్ సవివరంగా వెల్లడిరచారు.
ప్రధానంగా జిల్లాలో సిజీరియన్ కాన్పులు లెక్కకు మిక్కిలి జరుగుతున్నాయని, మహిళల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతోందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందని సూచించారు. అవసరం లేనప్పటికీ సీజీరియన్ చేస్తున్న వారి తప్పును ఎత్తిచూపాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని గుర్తు చేశారు.
గత మే నెలలో జిల్లాలో మొత్తం 1913 కాన్పులు కాగా, అందులో 75శాతం వరకు 1444 కాన్పులు సీజీరియన్ లేనని, కేవలం 459 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ తెలిపారు. పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో నూటికి నూరు శాతం సీజీరియన్ లే చేస్తున్నారని, సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నప్పటికీ పెద్దాపరేషన్లు చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదన్నారు.
అవసరమైన సందర్భంలో సీజీరియన్‌లు చేయడం సహేతుకమే అయినప్పటికీ, సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా సీజీరియన్లు చేయడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఇలాంటి తప్పిదాలకు పాల్పడే ఆసుపత్రుల గురించి పబ్లిక్ డొమైన్‌లో పెడతామని కలెక్టర్ తేల్చి చెప్పారు. జూలై నెలలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో జరిగే ప్రతి కాన్పును పరిశీలన జరిపిస్తామని, అవసరం లేకపోయినా సీజీరియన్ చేస్తున్న ఆసుపత్రుల అసంబద్ధ తీరును ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. సదరు ఆసుపత్రులకు వెళ్తే సీజీరియన్ లే చేస్తారని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.
ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సైతం సాధారణ ప్రసవాల దిశగా చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. ముహూర్తం కాన్పులు, పురిటి నొప్పులు తాళలేక సీజీరియన్ చేయాలని కోరే గర్భిణీలు, వారి కుటుంబీకులకు సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నార్మల్ డెలివరీకి కృషి చేయాలన్నారు. ఈ దిశగా కృషి చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ కు జిల్లా యంత్రాంగం పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు.
సిజేరియన్ వల్ల పుట్టిన శిశువులు అమృతతుల్యంగా భావించే ముర్రుపాలుకు దూరం అవుతారని, తల్లులు అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రసవాలకు ముందుకు వచ్చేలా తల్లిదండ్రులు సైతం గర్భిణీలను మానసికంగా సంసిద్ధులను చేస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని కలెక్టర్ కోరారు.
కాగా, అన్ని కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు. నెల రోజులుగా నిర్వహిస్తున్న సమీక్షలు, చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు 50 శాతానికి చేరాయని వివరించారు. వీటి సంఖ్యను మరింతగా పెంచేలా నిజాంబాద్ లోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
మహిళలు గర్భం దాల్చిన నాటి నుండే క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు ద్వారా వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలింపచేస్తూ, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ లు చేయిస్తున్నామని కలెక్టర్ వివరించారు. గర్భిణీల రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం డి – హబ్‌కు పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. దీనివల్ల గర్భిణీలు రక్తహీనత, ఐరన్ లోపం వంటి సమస్యలు కలిగి ఉంటే తక్షణమే చికిత్సలు అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా హరితహారం కార్యక్రమంలో ఈసారి జిల్లాలో 49 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డ్‌ల వద్ద ఖాళీ స్థలాలలో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు చెరువులు, కాలువ గట్ల పైన విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామని, దానికి ముందు ఆక్రమణలను తొలగిస్తూ హద్దులు ఏర్పాటు చేయిస్తామన్నారు.
సారంగాపూర్, చిన్నాపూర్ అర్బన్ పార్కులు, అటవీ స్థలాలు, జాతీయ రహదారికి ఇరువైపులా ఆకర్షణీయమైన మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో తొలి విడతలో 407 పాఠశాలలు ఎంపిక కాగా, 132 బడులలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు. మిగతా అన్ని పాఠశాలల్లోనూ ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు 2023 మార్చి నాటికి పనులను పూర్తి చేయిస్తామని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా 405 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ వివరించారు. రెండు కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు జరిపిస్తున్నామని వివరించారు. సెల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం పాల్గొన్నారు.