నిజామాబాద్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలతో పాటు ప్రసవాలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తనిఖీ బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో జిల్లా స్థాయి అధికారితో పాటు డిప్యూటీ డీఎం హెచ్‌ఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.
ఏ అంశాలను పరిశీలించాలి, నివేదిక ఎలా సమర్పించాలి అనే దానిపై కలెక్టర్ శుక్రవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా తనిఖీ బృందాలకు సూచనలు చేశారు. శనివారం నుండే ఆసుపత్రుల పరిశీలన చేపట్టాలని, ప్రతిరోజూ కనీసం రెండు హాస్పిటల్స్‌ను తనిఖీ చేస్తూ, పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. సామాజిక బాధ్యతగా భావిస్తూ పరిశీలన విధులను పక్కాగా నిర్వర్తించాలని సూచించారు.
జిల్లాలో జరుగుతున్న కాన్పులలో 75 శాతం సీజేరియన్లే అవుతున్నాయని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏకంగా 92 శాతం సిజేరియన్లు అవుతున్నాయని అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న కర్ణాటక పాటు ఇతర రాష్ట్రాల్లో కేవలం 35 శాతం మాత్రమే సిజేరియన్లు అవుతుండగా, స్థానికంగా జిల్లాల్లో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైతే వందకు వంద శాతం సిజేరియన్లు జరగడం దారుణమని కలెక్టర్ పేర్కొన్నారు.
తనిఖీ బృందాల పరిశీలన ప్రక్రియతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. తప్పనిసరి అయినప్పుడు సిజేరియన్ చేస్తే తప్పేమీ లేదని, కానీ అవసరం లేకపోయినా సిజేరియన్ చేయడం తీవ్ర ఆక్షేపణీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తరహాలో తప్పిదాలకు పాల్పడే ఆసుపత్రుల విషయంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతుందని, మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
అంతేకాకుండా తనిఖీ బృందాలు అందించే నివేదికను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఆసుపత్రులకు జిల్లా యంత్రాంగం పూర్తి మద్దతుగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సెల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అంజనా, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్, డీపీవో జయసుధ, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.